గీర్వాణ కవిదిగ్గజం తెలకపల్లి రామచంద్ర శాస్త్రి                                   -------------------------------------
                                                                                                                     -                                        -డా. వెలుదండ వేంకటేశ్వర రావు.


"అభినవ కాళిదాస బిరుదాంచితు లార్యులుదాత్త సాహితీ
విభవ విరాజితుల్ సరసవృత్త కవిత్వ కళావిశారదుల్
శుభకర వైద్య శేఖరులు జ్యోతిష వేత్తలు తెల్కపల్లి వం
శభవులు రామచంద్రకవి చంద్రులు వారిని ప్రస్తుతించెదన్"


         ప్రసిద్ధ సంస్కృత విద్వాంసులు తెలకపల్లి రామచంద్రశాస్త్రి గురించి శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు రాసిన పై పద్యంలోని విషయాలు స్తవాలు కాదు వాస్తవాలు. సాహిత్య రంగంలోనే గాక ఆయుర్వేద వైద్యంలోనూ; జ్యోతిష శాస్త్రంలోనూ; ఆధ్యాత్మిక రంగంలోనూ; తర్కశాస్త్రంలోనూ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించి పలువురి మన్ననల నందుకున్న పండితోత్తములు శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రుల వారు. అంతేగాక శాస్త్రిగారు మంచి పరిపాలనాదక్షులు. ఆయన స్వస్థలం కోడేరు మండలం రాజాపురం గ్రామానికి గ్రామపంచాయతీ వ్యవస్థ ఆరంభంలోనే రెండు పర్యాయాలు (10 సంవత్సరాలు) సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికకాబడి తన ప్రతిభను చాటుకున్నారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ఆధరాభిమానాలను చూరగొన్నారు.నాటి మహబూబ్ నగర్ జిల్లా నేటి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుత వ్యాస కథానాయకుడు తెలకపల్లి రామచంద్ర శాస్త్రి గారు తేది :- 6-12-1902 (శుభకృతు నామ సంవత్సరం సుబ్బరాయ షష్టి రోజున) ఉదయించారు. శేషమ్మ ,సుబ్బయ్య అను పుణ్యదంపతులు వీరి జననీ జనకులు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడు నారాయణశర్మ వైద్యశాస్త్రంలో దిట్ట. చిన్నవాడు వాసుదేవశర్మ ఫోటోగ్రాఫర్ గా వనపర్తిలో గొప్పపేరు సంపాదించారు. ఇక శేషమ్మ , సుబ్బయ్యల ద్వితీయ సంతానమే మన రామచంద్ర శాస్త్రులవారు.నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామం వీరి పూర్వీకుల నిలయం. ఈ గ్రామవాసులు ఎంతో మంది వివిధ కారణాలతో మహబూబ్ నగర్, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో తెలకపల్లి ఇంటిపేరుతో ఈ వంశీయులు కనిపిస్తారు. అలా గ్రామనామమే శాస్త్రిగారి ఇంటిపేరుగా స్థిరపడింది. రామచంద్ర శాస్త్రి గారిది స్మార్త సంప్రదాయం. కాశ్యపస గోత్రజులు, యజుశ్శాఖీయులు. 12 యేటనే శాస్త్రిగారికి ఉపనయనం జరిగింది.ఆనాడు తెలంగాణా ప్రాంతం నైజాం పరిపాలనలో వుండేది. ఉర్దూ అధికారభాష. తెలుగు, సంస్కృతాలకు ఆధరణ లేదు. హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలు మచ్చుకైనా కనిపించేవి కావు. అన్నీ ఉర్దూ మీడియం పాఠశాలలే. కాబట్టి తండ్రి సుబ్బయ్య గారు రామచంద్ర శాస్త్రి గారికి ఇంటి దగ్గరే కులవిద్య నారంభించి, పురుషసూక్తాలం చెప్పించారు. వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యం విద్య నేర్చుకుంటూనే 27-3-1914 నాడు కొల్లాపురం తాలూకా యాపర్లలో ఘనంగా నిర్వహించిన సప్తాహంలో రామకోటి జపంలో శాస్త్రిగారు పాల్గొన్నారు. ఆ తర్వాత వనపర్తికి వెళ్ళి పల్లా యజ్ఞ నారాయణ శర్మ గారి దగ్గర శిష్యరికం చేసి 'పంచదశకర్మలు' నేర్చుకున్నారు. ఈ సమయంలోనే మహాపండితుడైన విక్రాల వేంకటాచార్యుల వారితో రామచంద్ర శాస్త్రికి పరిచయం ఏర్పడింది. వేంకటాచార్యుల వారు శాస్త్రిగారికి దక్షిణామూర్తి మంత్రోపదేశం చేశారు. తదనంతర కాలంలో విక్రాల వేంకటాచార్యులు, తెలకపల్లి శాస్త్రి గారు కలిసి జంటకవులుగా సంస్కృతంలో కవిత్వం చెప్పారు.వేదవిద్యను నేర్చుకోవాలన్న ప్రగాఢ మైన కోరికతో రామచంద్రశాస్త్రి గారు 1915లో కర్నూలు లోని ఇంద్రగంటి శేషావధానులచే నడుప బడుతున్న వేద సంస్కృత పాఠశాలలో చేరారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న వేదపండితులు సుబ్రహ్మణ్య ఘనాపాఠి దగ్గర యజుర్వేదం ఓ అష్టకం శాస్త్రి గారు పూర్తిచేశారు. సుబ్రహ్మణ్య ఘనాపాఠి గారు ఏవో కారణాల చేత పాఠశాల వదిలి వెళ్ళడంతో శాస్త్రిగారి చదువుకు ఆటంకం ఏర్పడింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న సంస్కృత విద్వాంసులు వెల్లాల శంక‌రశాస్త్రి గారు రామచంద్రశాస్త్రిని సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిందిగా ప్రోత్సాహించారు. దానితో సంస్కృత సాహిత్యం పట్ల అభిలాష పెంచుకున్న శాస్త్రిగారు శంకరశాస్త్రి దగ్గర శబ్దమంజరి, రామాయణ సంగ్రహం మరియు కుమారసంభవం కావ్యాలను అధ్యయనం చేశారు. అక్కడే ఒక ఏడాది పాటు విద్యనభ్యసించి శాస్త్రి గారు సంస్కృత సాహిత్యం పై పట్టు సాధించారు. కర్నూలులో చదువుచున్నప్పుడే శాస్త్రిగారు 1917 లో తన సహాధ్యాయి రామకిష్టయ్యతో కలిసి 'మొడేకుర్రు' (తూర్పుగోదావరి జిల్లా) అనే గ్రామంలో నివాసముంటున్న సంస్కృత విద్వాంసులు శ్రీపాదసుబ్బరాయ శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళి కొంతకాలం విద్యనభ్యసించారు. అక్కడ శాస్త్రిగారు భారవి కిరాతార్జనీయం నాలుగు సర్గలు; మాఘకావ్యం రెండు సర్గలు; రామాయణ చంపువు ఆరు కాండలు చదువుకున్నారు. ఒకసంవత్సరం పాటు అక్కడ విద్యాభ్యాసం చేసిన శాస్త్రిగారు అనివార్య పరిస్థితుల్లో చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామం చేరుకున్నారు.రాజాపురం చేరుకున్న శాస్త్రి కొంతకాలం ఊరిలోనే గడిపి తిరిగి 1918లో కర్నూలు చేరారు. అక్కడ కాసావజ్జల సత్యనారాయణ గారి దగ్గర వ్యాకరణాన్ని అభ్యసించారు. ఆ తర్వాత కొంతకాలం శ్రీకాళహస్తి, అకిరిపల్లి, నూజివీడు, బందరు, మచిలీపట్నం మొదలైన ప్రాంతాల్లో వ్యాకరణం, అలంకార శాస్త్రాలను అభ్యసించారు. ఈ కాలంలో సూరి భగవంతం, కంభంపాటి రామమూర్తి వంటి నిష్ణాతులైన సంస్కృత పండితుల దగ్గర శిష్యరికం చేసి సంస్కృత బాషలో పాండిత్యం గడించారు. తాను చదువుకున్న బందరు జాతీయ కళాశాలలోనే ఒక సంవత్సరం పాటు (1923) శాస్త్రిగారు అధ్యాపకులుగా పనిచేశారు.1924వ సంవత్సరంలో రామచంద్రశాస్త్రుల వారు తిరిగి స్వగ్రామం రాజాపురం చేరుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ, వంశపారంపర్యంగా వస్తున్న పౌరోహిత్యం కూడా శాస్త్రిగారు చేశారు. ఆరోజుల్లో సింగాయపల్లి, మాచుపల్లి గ్రామాల్లో శాస్త్రిగారు ప్రధానంగా పౌరోహిత్యం చేశారు. తురకదిన్నె (రాజాపురానికి సమీప గ్రామం) గ్రామస్తుడైన కొత్త లక్ష్మారావు గారికి వచ్చిన ఆస్తిచిక్కులను రామచంద్రశాస్త్రి గారు తన సుందరకాండ పారాయణంతో పోగొట్టారు.రాకొండలో కరువు సంభవించినప్పుడు శాస్త్రిగారు మన్యుసూక్తం పారాయణం చేసి దేవుడిని ప్రార్థించారు. ఆరోజు భారీవర్షం కురిసి చెరువులు, కుంటలు నిండాయి. ప్రజల సంతోషానికి అవధులు లేవు. లక్ష్మారావు తులం బంగారంతో ఉంగరం చేయించి శాస్త్రిగారికి బహూకరించారు. అంతేగాక శాస్త్రిగారిని వివాహం చేసుకొమ్మని ప్రోత్సాహించారు. అప్పుడు శాస్త్రిగారి వయస్సు 22 ఏళ్ళు. వనపర్తి అప్పయ్యగారు శాస్త్రిగారికి మేనమామ. అప్పయ్యగారు తన కూతురు కృష్ణవేణమ్మను ఇచ్చి శాస్త్రిగారికి వివాహం చేశారు. దురదృష్టవశాత్తు కొద్దికాలంలోనే కృష్ణవేణమ్మగారు అకాలమరణం చెందారు. ఆ తర్వాత కొంతకాలం శాస్త్రిగారు జీవితంపట్ల నిర్వేదం చెందారు. బంధువులు, మిత్రుల ప్రోద్బలంతో బెంగుళూరు వాస్తవ్యులైన పాణ్యం రామశేషశర్మ పార్వతమ్మల కూతురు 'లలితాంబ' గారిని 1927లో ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. 'లలితాంబ' గారు శాస్త్రిగారికి అన్నివిధాలుగా జీవితంలో చేదోడు వాదోడుగా నిలిచారు. వీరి అన్యోన్య దాంపత్య ఫలితంగా నలుగురు కూతుర్లు, ముగ్గురు కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు సూర్య నారాయణశర్మ గ్రామంలోనే వ్యవసాయం, పురోహితం చేసుకుంటూ జీవనం సాగించారు. ద్వితీయ కుమారుడు సుందర శర్మ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగిగా పదవీవిరమణ చేశారు. ఇక శాస్త్రిగారి చిన్న కుమారుడు రాజశేఖర శర్మ పోస్టాఫీసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా చాలాకాలం పనిచేసి పదవీవిరమణ పొందారు. రామచంద్రశాస్త్రి గారి అముద్రిత కృతులను వెలుగులోకి తీసుకురావడానికి రాజశేఖర శర్మగారు చేస్తున్న కృషి మరవలేనిది. అంతేగాక రాజశేఖర శర్మగారు మంచి సాహితీవేత్త కూడా కావడం గమనార్హం.రామచంద్రశాస్త్రి గారికి మాచుపల్లి, రాజాపురం, రేముద్దుల, తురకదిన్నె, సింగాయపల్లి మొదలైన ప్రాంతాల్లో ఎంతోమంది శిష్యులున్నారు. ముఖ్యంగా మాచుపల్లి గ్రామంతో ఆయనకు ఊరు పౌరోహిత్యం కారణంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మాచుపల్లి గ్రామంలో దేశరాజు సీతారామరావు గారు గ్రామ పట్వారీగా; సాహిత్య, ఆధ్యాత్మిక రంగాలలో గాఢమైన అభినివేశం కలిగిన వారుగా ఆ ప్రాంతంలో ప్రసిద్దులు. శాస్త్రిగారు సీతారామరావు గారి ఇంటి పురోహితులు. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. సీతారామరావు గారు శాస్త్రిగారిని 'మామయ్యా'! అని సంభోధించేవారు. శాస్త్రిగారు కూడా ఆయనను 'అల్లుడూ'! అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. శాస్త్రిగారు మాచుపల్లి గ్రామం వచ్చినప్పుడు వారం‌‌, పదిరోజుల పాటు సీతారామరావు గారింట్లోనే నివాసముండేవారట. వారిద్దరి మధ్యగల ఆత్మీయ సంబంధం అలాంటిది. శాస్త్రిగారు తాను రాసిన 'శ్రీ హయగ్రీవ శతకం‌, రవీంద్ర తపఃఫలం' పుస్తకాలను సీతారామరావు గారి ఇంట్లోనే కూర్చుని రాశారు. సీతారామరావు గారు శాస్త్రిగారితో ఎన్నో ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాలు తెలుసుకున్నారు. సీతారామరావు గారు రామచంద్రశాస్త్రిని తన 'ఆధ్యాత్మిక గురువు' గా చెప్పుకుంటారు. ఇవీ సంక్షిప్తంగా రామచంద్రశాస్త్రి గారి జీవిత విశేషాలు.సాహితీ జీవనం:--------------------------రామచంద్రశాస్త్రి గారి రచనల్లో ఎక్కువభాగం ఈ సదస్సు నిర్వాహకులు పెట్టుకున్న కొలమానం 1900 -1950 మధ్యకాలంలోనే రాయబడ్డాయి. శాస్త్రిగారి రచనలన్నింటినీ రేఖామాత్రంగా పేర్కొంటూ; 1900-1950 మధ్యకాలంలో వచ్చిన శాస్త్రిగారి రచనలపై ప్రధాన దృష్టి పెట్టి ఈ వ్యాస నిర్మాణం చేయడం జరిగింది.రామచంద్రశాస్త్రి గారు ప్రధానంగా సంస్కృత కవి. కాబట్టి ఈయన కృతులన్నీ సంస్కృత భాషలోనే సాగాయి. కొన్ని రేడియో ప్రసంగాలు, ఒకటి రెండు పత్రికా రచనలు తెలుగులో వచ్చినప్పటికీ అవి పెద్దగా లెక్కలోకి తీసుకోలేము. 

శాస్త్రిగారి రచనలు-----------------------------------ముద్రితాలు-----------------1) భారతీతారామాల (1924)2) కవితాకాంతా స్వయంవరం (1926)3) శ్రీ హయగ్రీవ శతకం (1932)4) గురుపీఠ తత్త్వ దర్శనం (1936)5) శ్రీ శారదాస్తుతి (1965)6) శ్రీ ఉమామహేశ్వర సుప్రభాతం (1977)7) శ్రీ మామిళ్ళపల్లి నృసింహ సుప్రభాతం (1980)8) శ్రీ హనుమత్సుప్రభాతం (1991)9) భూభ్రమణ వృత్తాంతం

అముద్రితాలు--------------------1) కావ్యలక్ష్మీ 2) కలిశతకం3) రవీంద్ర తపఃఫలం 4) ధూమశకట ప్రమాదం5) చ్యవనోపాఖ్యానం 6) సుకన్యాస్తవం.7) మృత్యుశకటం.తెలకపల్లి రామచంద్రశాస్త్రి గారి తొలి సంస్కృత ఖండకావ్యం 'భారతీతారామాల'. 27 ఆర్యా వృత్తాలతో 21 సంవత్సరాల వయస్సులో రాసిన ఈ కావ్యాన్ని 1923లో శ్రీ దుర్గా మల్లికార్జునం గారు ప్రచురించి కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో పంచారు.రామచంద్రశాస్త్రి రెండవ కావ్యం 'కవితాకాంతా స్వయంవరం' (1926) శాస్త్రిగారి స్నేహితుడైన తుర్కదిన్నె మఖ్తెదార్ కొత్తా లక్ష్మారావు ద్రవ్యసహాయంతో ముద్రించారు. 1926లో రామచంద్ర శాస్త్రిగారు మిత్రులు విక్రాల వేంకటాచార్యుల తో కలిసి మహారాష్ట్ర లోని హుమ్నాబాద్ కు వెళ్ళారు. అక్కడ గల మాణిక్య ప్రభు పీఠం దర్శనానికి వెళ్లారు. అప్పుడు ఆ పీఠానికి ఖండోజీరావు గారు అధిపతిగా వున్నారు. ఆ పీఠంలో అప్పుడప్పడు పండిత సభలు జరుగుచుండేవి. ఆ సభల్లో శాస్త్రిగారు పాల్గొని ఆశువుగా కొన్ని శ్లోకాలను చెప్పారు. అక్కడున్న పండితులు వీరిని 'బాలకవి' అన్నారట. దానితో మన శాస్త్రిగారు కోపంగా నేను బాలకవిని కాదు 'ప్రౌఢకవి'ని అన్నారట. అక్కడున్న పండితులలో ఒకరు మీరు ప్రౌఢకవి అయితే సరస్వతీ బ్రహ్మ లను తీసుకుని ఏదైనా కథను కల్పించి కావ్యం చెప్పమన్నారట. శాస్త్రిగారు వెంటనే ఆశువుగా 55 ఆర్యావృత్తాలతో సరస్వతికి సంగీత, సాహిత్యాలనే ఇరువురు కుమార్తెలు కలిగినట్లు; వారు స్వయంవరంలో శ్రీకృష్ణుడిని వరించినట్లు ఓ కథను కల్పించి చెప్పారట. ఖండోజీరావు ప్రభువు అది విని ఎంతగానో సంతోషించి సభాసదుల సమక్షంలో శాస్త్రిగారికి శాలువా కప్పి, నూటపదహార్లిచ్చి గొప్పగా సన్మానించారు. ఇదే 'కవితాకాంతా స్వయంవరం' కావ్యం.రామచంద్రశాస్త్రి గారి రచనలన్నీ భక్తిరస ప్రధానాలే. 1931వ సంవత్సరం లో శాస్త్రిగారు రచించిన 'లలితాస్తవఝరీ'-- కావ్యాన్ని అలంపూరు తాలూకా క్యాతూరు గ్రామ నివాసి సోమగౌడు పుల్లయ్య గారు ముద్రించారు. ఇది 'మందాక్రాంత' వృత్తాలతో సాగిన భక్తిరసప్రవాహం. 'మ-భ-న-త-త-గగ'- అను గణాలతో సాగే మందాక్రాంతం ఛందస్సు శాస్త్రిగారికి ప్రీతిపాత్రమైనదిగా తెలుస్తుంది. వీరు రాసిన శారదా నవరత్న మాలిక; శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి స్తుతి; శ్రీ మదభినవ విద్యాతీర్థ స్తుతి మొదలైన చిన్నరచనలు ఎన్నో మందాక్రాంత వృత్తాలతో సాగినవి. మ- గణం విష్ణు సంబంధితమైనది. కాబట్టి మ- గణాన్ని మంగళకరంగా భావించడం సంప్రదాయంగా వస్తున్నది.1932వ సంవత్సరంలో రామచంద్రశాస్త్రి కుటుంబ సమేతంగా తన అత్తగారింటికి బెంగుళూరుకు వెళ్ళారు. బెంగళూరులో గడిపిన కొద్దికాలంలో దగ్గరలో గల మైసూరు పట్టణాన్ని దర్శించాలన్న కోరిక శాస్త్రిగారికి కలిగింది. మైసూరు పట్టణం వెళ్ళి అక్కడి రాజగురువులు, పరకాల పీఠాధిష్టితులు అయిన శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. వారిపై గల భక్తి భావంతో తాను రాసిన కొన్న శ్లోకాలను చదువబోగా స్వామివారు వారించి మీకు, మాకు క్షేమకరం, సంతోషదాయకం, ముక్తిప్రధానమైన దేవతా విషయకమైన శ్లోకాలను వినిపించమని అభ్యర్థించారు. వెంటనే మఠంలోనే వెలసియున్న శ్రీ హయగ్రీవ స్వామిని దర్శించుకొని " త్వదపాంగ శైత్య పరిచయ జాతాజ్జగతీ హదస్సహాభి భవాత్ హయముఖ" ----------- అని మొదలు పెట్టి ఆశువుగా 15 శ్లోకాలు చెప్పారు. అవి విన్న రంగనాథ స్వాములవారు అమితానంద భరితులై 'హయగ్రీవ స్వామి'పై ఒక శతకం రాయవలసిందిగా శాస్త్రిగారి ని కోరారు. శాస్త్రిగారు ఇంటికి చేరుకొని అనతికాలంలోనే 100 ఆర్యావృత్తాలతో "శ్రీ హయగ్రీవ శతకా" న్ని పూర్తి చేసి మైసూరు వెళ్ళి రంగనాథ స్వాములవారికి సమర్పించారు. మైసూరు రాజా శ్రీకృష్ణ రాజేంద్ర వడయార్ ఆస్థానంలో పండితుల సమక్షంలో రంగనాథ స్వామి, శాస్త్రిగారి చేత ఈ శతకాన్ని చదివింప జేశారు. శాస్త్రిగారు పండిత ప్రశంసలందుకున్నారు. రంగనాథ స్వాముల వారు శాస్త్రిగారిని రజిత పంచపాత్రము, శాలువా పీతాంబరములతో సత్కరించారు. ఈ శతకాన్ని మైసూరు మహారాజు స్థాపించిన శ్రీ వాణీ విలాస సంస్కృత పాఠశాల నుండి వెలువడుతున్న త్రైమాసిక పత్రికలో దేవనాగరి లిపిలో ముద్రించారు. పరకాల పీఠాధిపతి రంగనాథ స్వాముల వారి జన్మస్థానం పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని మానాజిపేట గ్రామం కావడం ఇక్కడ గమనార్హం. రంగనాథ స్వాముల వారు సంస్కృత భాషలో అపూర్వమైన ప్రజ్ఞా పాటవాలు కలిగిన పండితులు. వీరు రచించిన 'అలంకార మణిహారం' గ్రంథాన్ని రామచంద్రశాస్త్రుల వారికి బహూకరించారు. రామచంద్రశాస్త్రి గద్వాల సంస్థానంలో ఆస్థాన సంస్కృత విద్వాంసులుగా వున్న కాలంలోనే గద్వాల మహారాణి ఆది లక్ష్మి దేవమ్మ గారు ' శ్రీ హయగ్రీవ శతకా'న్ని తెలుగు లిపిలో సంస్థాన ముద్రణాలయంలోనే అచ్చుచేయించారు. మరికొన్ని స్తోత్రాలతో కలిపి శ్రీ హయగ్రీవ శతకాన్ని 1981వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక ససకారంతో పునర్ముద్రించారు. గద్వాల రాణి శాస్త్రిగారి ప్రతిభను గుర్తించి ఆంతరంగిక సలహాదారుగా నియమించుకున్నారు. శాస్త్రిగారి ప్రేరణతో రాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారు శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిని దర్శించుకొని స్వామి ఆశీస్సులతో సంస్థాన సమస్యలను దూరం చేసుకున్నారట.రామచంద్రశాస్త్రి కలం నుండి జాలువారిన మరో గొప్పరచన "గురుపీఠ తత్త్వ దర్శనం". ఇది తెలుగు, సంస్కృతం మిళితమైన వచనరచన. ఇది 1936లో రాయబడింది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆదిశంకరాచార్యులు దేశంలో భక్తి భావాన్ని పెంపొందించారు. ఆదిశంకరులు తన అద్వైత సిద్ధాంత ప్రచారానికి దేశమంతా తిరిగి శివలింగాలను ప్రతిష్టించి ఆయా ప్రాంతాలలో శైవమఠాలను ఏర్పాటు చేశారు. అయితే కంచి కామకోటి పీఠం ఆదిశంకరులు ప్రతిష్టించింది కాదని ఒక అపవాదు ఆనాడు సమాజంలో నెలకొన్నది. రామచంద్రశాస్త్రి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములవారి భక్తులు. ఆయన 1936లో సరస్వతీ స్వాముల వారిని దర్శించుకున్నారు. కామకోటి పీఠం ఆదిశంకరుల వారిచే ప్రతిష్టితం కాదన్న మాట శాస్త్రిగారిని ఎంతగానో బాధించింది. వెంటనే వారణాసి, పూనా నగరాలలోని గ్రంథాలయాలను దర్శించి , ఎన్నో ఆధారాలను సేకరించి , తాళపత్ర గ్రంథాలను శోధించి కామకోటి పీఠం ఆదిశంకరుల చేత ప్రతిష్టిత మైనదేనని నిరూపించారు. దేశం నాలుగు దిక్కలలో యోగ, భోగ, వర, ముక్తి లింగాలను ప్రతిష్టించిన ఆదిశంకరులు; మోక్ష లింగాన్ని కంచిమఠంలో ప్రతిష్టించారని సాధికారికంగా నిరూపిస్తూ రాసిన గ్రంథమే "గురుతత్త్వ పీఠదర్శనం". ఇది శాస్త్రిగారి పరిశోధనా పటిమకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పుస్తకం 1936లో గద్వాల మహారాణి వారిచే ముద్రించబడింది. 1984లో శ్రీ కుప్పా దక్షిణామూర్తి గారు ద్వితీయ ముద్రణ చేశారు.రామచంద్ర శాస్త్రులవారు గద్వాల సభలో అప్పన్నశాస్త్రి చేత 'అభినవ కాళిదాస' బిరుదును అందుకున్నారు. మహామహోపాధ్యాయ సిద్ధాంతి శివశంకర శాస్త్రిగారి చేత 'కవికులాలంకార' బిరుదాన్ని అందుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పరిశోధక శిఖామణులు సురవరం ప్రతాపరెడ్డి చేతుల మీదుగా శాస్త్రిగారు 'కవికల్పద్రుమ' ; 'అలంకార నటరాజ' బిరుదు లందుకున్నారు.


రామచంద్రశాస్త్రి జీవితం రచనలపై సంబరాజు రవిప్రకాశ రావు; తెలకపల్లి రాజశేఖర శర్మగారల సంపాదకత్వంలో ఒక చక్కని పరిశోధనా గ్రంథం 'తెలంగాణ వికాస సమితి' మహబూబ్ నగర్ వారు వెలువరించారు.


             సదస్సు నిర్వాహకులు విధించిన కొలమానం ఆంక్షలచేత శాస్త్రిగారి రచనల్లో 1900-1950 ప్రాంతంలోని వాటిని మాత్రమే విశధీకరిస్తూ వ్యాసాన్ని సంక్షిప్తీకరించడం జరిగింది. తీవ్ర అనారోగ్య కారణాలతో తెలకపల్లి రామచంద్రశాస్త్రి 30-4-1990 నాడు తన చిన్న కుమారుడు రాజశేఖర శర్మగారి దగ్గర మహబూబ్ నగర్ పట్టణంలోనే పరమపదించారు. సంస్కృత సాహితీలోకం; ముఖ్యంగా పాలమూరు గీర్వాణ పండితలోకం ఒక విలక్షణ, ప్రౌఢ సంస్కృత విద్వాంసుడిని కోల్పోయింది."జాతస్య హి ధ్రువో మృత్యుః"- పుట్టిన వాడికి మరణం తప్పదు అన్న భగవద్గీతా శ్లోకంతో సంతృప్తి చెందడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.


-డా. వెలుదండ వేంకటేశ్వర రావు.తెలుగు పండితులు.మహబూబ్ నగర్

చరవాణి : 8790421061.


Comments

Popular Posts