శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
ఉమామహేశ్వర స్తుతిః (19-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
8
నజానే మహేశం వినాదేవమన్యంనయాచే పరం నీలకంఠా ద్వదాన్యం !
ఉపాసే మనుమ్నేతరం శైవ మంత్రా
న్నివాసే సదా శంకరాస్యాహమాసే !!
తాత్పర్యము
మహేశ్వరుని తప్పించి ఇంకొక దేవుని గూర్చి నాకు తెలియదు.
నల్లనిమెడ కలిగిన శివుని తప్పించి ఇంకొకరిని నేను యాచించను.
శివ మంత్రము (ఓం నమశ్శివాయ) తప్పించి ఇంకొక మంత్రము నేను ఉపాసింపను.
ఎప్పుడు శంకరుని నివాసమునందే నేను కూర్చుందును.(శంకరుని నిరంతరము హృదయములో తలుస్తాను అని భావం)
విశేషాలు
మహేశ్వరుడు
మహాంశ్చాసావీశ్వరశ్చ- శ్రేష్ఠుడైన ఈశ్వరుడు కనుక శివునికి మహేశ్వరుడని పేరు.
ఓంనమశ్శివాయ
‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం నమశ్శివాయకు కొందరు చెప్పారు.. ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం.
.న అనగా భూమి, మ అనగా నీరు, శి అనగా నిప్పు, వ అనగా గాలి, య అనగా ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలను కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు. పంచభూతాత్మకమయిన ఈ మానవ శరీరం నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు శుభ్రపడుతుంది.మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కనుకనే తెలకపల్లివారు అంతదృఢంగా శివ మంత్రము (ఓం నమశ్శివాయ) తప్పించి ఇంకొక మంత్రము నేను ఉపాసింపనని చెప్పారు.
09
కవీనాముపఘ్నం కలిప్రాభవఘ్నం
భవఘ్నం సవఘ్నం పరివ్రాడుపజ్ఞం !
తమోఘ్నం విషఘ్నేషు బిల్వఛ్చదేషు
ప్రమోదం దధానం మహేశం నమామి !!
తాత్పర్యము
తీగఅల్లుకోవటానికి సమీపములో పెట్టు కొయ్య లోనగుదానిని ఉపఘ్నము అంటారు. కవులకు అటువంటి సమీపాశ్రయమైన శివుని- (అనగా కవులకు ఆధారమైనవానిని),
4,32,000 సం.ల కాలము కలిగిన కలియుగ పురుషుని పాపపు ఆధిక్యాన్ని నశింపచేయుశివుని,,
చావు పుట్టుకల సంసార చక్రాన్ని నశింపచేయుశివునిని, దక్ష యజ్ఞ వినాశకుని, పరివ్రాజకుల మనస్సులలో ఉపదేశము లేక తనంత తానుగా వారిలో వెలుగు జ్ఞాన స్వరూపుడైన శివుని,
అగ్ని స్వరూపుని, విషమునకు విరుగుడు అయిన ఉమ్మెత్త లేక చిర్రికూరఅకులందు, మారేడు ఆకులందు సంతోషము ప్రసాదించు పరమశివునికి నమస్కరింతును.
విశేషాలు
పరివ్రాట్
ఇహలోకంలో గాని, పరలోకంలో గాని సుఖదుఃఖాలతో కూడిన సంసారం వద్దని వదలుకొన్నవాడు పరివ్రాజకుడు. గృహస్థ ధర్మాన్ని, విషయభోగాలను, సర్వాన్నీ పరిత్యజించినవాడు పరివ్రాజకుడని ‘శబ్దకల్ప ద్రుమం’ కూడా తెలియజేస్తున్నది. (పరిత్యజ్య సర్వాన్ విషయ భోగాన్ గృహాశ్రమాత్ ప్రజతి గచ్ఛతీతి పరివ్రాట్ )
విషఘ్న
ఉమ్మెత్త పూలు లేక చిర్రికూర ఆకులు తగుమాత్రముగా తీసుకొంటే విషము విరుగుడు అవుతుంది. అందుకే వీటిని విషఘ్నములంటారు రుచికరమైన ఆకుకూరలలో చిర్రి కూర ఒకటి. సంస్కృతం లో తండులీయ, మేఘనాధ, ఘన స్వన , భండీర, విషఘ్న, కచర అని అంటారు. కొద్దిపాటి తేమ గల ప్రదేశాల్లో ఈ కూర బాగా పెరుగుతుంది.
చిర్రికూర స్థావర విషాన్ని, జంగమ విషాన్ని అనగా (పాము మొదలైన జంతువుల విషాన్ని ) హరిస్తుంది. విష రక్తాన్ని శుభ్రపరచడంలో ఇది పెట్టింది పేరు. పెట్టు మందుల దోషాన్ని పోగొట్టడానికి చిర్రి కూరను వండి పెడతారు. (అంతర్జాల సౌజన్యం)
తెలకపల్లి వారు ఈ “విషఘ్న”గురించి ఎలా తెలుసుకోన్నారో ! ఎంత సునిశితమైన పరిశీలన.! వారి లోకావగాహనకు శిరసా నమామి.
ఇక్కడితో ఉమా మహేశ్వర స్తుతి పూర్తయింది.
Comments
Post a Comment