శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (30-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
ముక్తిప్రద లసత్కాఞ్చీకంపాతటవిహారిణే !
శ్రీ కామాక్షీ సనాథాయశ్రీ మహేశాయ మఙ్గళం!!10
తాత్పర్యము
ముక్తిని అనుగ్రహించు సామర్థ్యము కలవానికి, ప్రకాశించు కంచి నగరంలో కంపానదీ తీరంలో విహరించువానికి, శ్రీ కామాక్షీదేవితో కూడుకొన్న వానికి శ్రీ మహేశునికి శుభము.
విశేషాలు
ముక్తి
1. ముక్తి అనగా జనన మరణాల చక్రం నుంచి విముక్తి పొందడం.
2. అవిద్య నశించడం ముక్తి. ఇలాంటి ముక్తులు నాలుగు విధాలని కొందరు, ఐదు విధాలని కొందరు అంటారు.
3. ఐదు విధాల ముక్తులివి : 1. సార్ష్టి (అంటే సృష్టించే శక్తి, సమానాధికారం కలది అనే అర్థాలు ఉన్నాయి), 2. సాలోక్యం, (ఏ దేవతను ఆరాధిస్తారో ఆ దేవతకు చెందిన లోకంలో ఆ దేవతతో పాటు ఉండటం. మరో విధంగా చెప్పాలంటే, ఒకే లోకంలో కలసి జీవించడం. ఉదాహరణకు భర్త ఉన్న లోకంలో అతడితో కలసి భార్య జీవించడం.) 3. సావిూప్యం, (దేవతకి సమీపంలో ఉండగలిగే భాగ్యం).4.సారూప్యం (తాను ఉపాసించే దేవతను నిరంతరం ధ్యానించడం చేత ఆ దేవతా రూపాన్ని ధరించడం) 5. సాయుజ్యం. (దేవతకు భిన్నము కాకుండా పూర్తిగా తన జీవభావం దేవతలో విలీనం కావడం) నాలుగు విధాలనే వారు ‘సార్ష్టి’ని ఇందులో చేర్చరు. సార్ష్టి, సాయుజ్యం ఒకటే అని శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వివరణ.
4. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటయిన కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది.
5. ‘క‘ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అనేది లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని తాత్పర్యం
6. . దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసే సమయంలొ అప్పుడు శివుడు పెద్ద అలలతో కంపానది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని శివుడు పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి లింగాన్ని కాపాడిందని చెబుతారు.
-: ఇత్యుమామహేశ్వర మఙ్గళాశాసనం
ఇక్కడితో “అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి మఙ్గళా శాసనం అనువాద విశేషాలతో పూర్తయినది.
Comments
Post a Comment