శ్రీ శివాయ గురవే నమః
అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(21-04-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి

ఆకాశశాఖి శిఖరాన్నిపతంతిఖల్య
వాతాహతాన్యుడుసుమానిగతేశ్చ్యుతాని
ప్రాగ్దిగ్వధూర్ద్యుతిమతీహసతీస్థితేవ
శ్రీమన్మహేశ్వర! విభో! తవసుప్రభాతం !! 6


               ఆకాశపు చెట్టుకొననుండి నక్షత్రపు పూలు జారిపడుచున్నవి.కళ్ళములో(ధాన్యమును నూర్చేచోటులో) గాలి చేత చెల్లాచెదరు కాకుండా ఆనక్షత్రపు పూలు అన్నీ తూరుపు దిక్కువైపు సరిగా పడుతున్నాయి.ఆ తెల్లని నక్షత్రాల కాంతితో తూరుపు దిక్కు అనే కాంత బాగా తెల్లగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది.సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం. 

విశేషము:

వడ్లు మొ|| ధాన్యములోని చెత్తను తొలగించుటకు ధాన్యముగల చేటను పైకెత్తి ధాన్యమును కొద్దికొద్దిగా తూర్పు గాలికి చెత్త పోవునట్లు క్రిందికి పోయుటను తూర్పాఱబట్టుట అంటారు( తీవ్రముగా విమర్శించుట అనే అర్థం ఉంది. అది వేరే సంగతి)ఆకాశపు చెట్టుకు పూసిన నక్షత్రాలనే పూలను ఇలా ఎవరో తూర్పారబడుతున్నప్పుడు గాలిదెబ్బ తగలని పూలు తూర్పు దిక్కు వైపు పడి తెల్లగా మెరిసాయి. అది ఎలా ఉందంటే తూరుపు దిక్కుఅనే కాంత తెల్లగా, స్వచ్ఛంగా నవ్వుతున్నట్లు ఉందని కవి మనోహరమైన భావన.

Comments

Popular Posts