శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(03-05-17)
 అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి
                     
లఙ్కాధినాథ హననోదిత దుష్కృతార్తి
నాశాయ దాశరథినా  సహకీశవర్గైః
సంస్థాపితోంబుధి తటే ౽ సి జగత్ప్రసేవ్య
శ్శ్రీమన్మహేశ్వర! విభో ! తవ సుప్రభాతం!  18

తాత్పర్యము

పరమశివా ! లంకకు సర్వాధికారిఅయిన ,బ్రాహ్మణుడయిన రావణుని సంహరించుటచేత   శ్రీరామునికి బ్రహ్మ హత్య ( బ్రాహ్మణుని చంపుట)అను మహా పాపము  కలిగినది. ఆ పాపదుఃఖాన్ని పోగొట్టుకోవటానికి దశరథుని కుమారుడైన శ్రీరాముడు , వానరములతో కలిసి రామేశ్వరములో , సముద్ర తీరములో నీ లింగాకృతిని స్థాపించాడు.సర్వప్రపంచముచే సేవింపదగినవాడా ! సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

పంచ-మహాపాతకములు

1.      బంగారము దొంగిలించుట 2. మద్యపానము, 3. బ్రహ్మహత్య, 4. గురుపత్నీ సంగమము, 5. పై పాతకములు చేసినవానితో స్నేహము.
2.      రామేశ్వరం
తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో  ఈ రామేశ్వర   పట్టణం ఉంది.
కాశీ గంగా జలాన్ని రామేశ్వరమునకు తెచ్చి పూజించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయముగా కొందరు పాటిస్తారు.
రామేశ్వర పదంపై  పండిత లోకంలో ఒక చక్కని కథనం ప్రచారంలో ఉంది.  రామునికి ప్రభువు- (తత్పురుష సమాసము) అని విష్ణువు రామేశ్వర పదానికి అర్థం చెప్పాడు. .రాముడు ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు (బహువ్రీహి సమాసము) అని శివుడు అర్థం  చెప్పాడు.రాముడే  ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని (కర్మధారయము )  రామేశ్వర పదానికి   బ్రహ్మ అర్థం చెప్పాడు. ఈ రామేశ్వరుల ఐక్యతాభావం శిరోధార్యమైనది.స్వస్తి.

Comments

Popular Posts