శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర కృతిసమర్పణము -(09-05-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి

తన కృతిసమర్పణమును ఈశ్లోకములో కవి వివరిస్తున్నారు.

మాలినీవృత్తం

సులలిత పద పత్రోభావగంధ స్సువర్ణో
గుణ ఖచిత మనోజ్ఞ స్సద్రసశ్లోకపుష్పః !
రచిత ఉపహృతశ్శ్రీ సుప్రభాతాఖ్యగుఛ్చః
ప్రవిలసతుమయాయంశ్రీమహేశాఙ్ఘ్రి యుగ్మే !! 24

ఈ సంపత్ప్రదమయిన సుప్రభాతము అను పేరు కలిగిన 23 శ్లోకముల పూల గుత్తి బాగా అందమయిన పదములనెడి ఆకులు కలిగినది. భావములనెడి గంధములు ( కస్తూరి, చందనము, కర్పూరము, అగరు, మలయాగరు చందనములు)కలది. చక్కని రంగు కలిగినది.(చక్కని పొందికయిన అక్షరములు కలది. ) ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అను భగవంతుని షడ్గుణములు కలిగినది. (పూలగుత్తి పక్షమున గుణఖచితమనగా దారముతో పొదగబడినది.) మనోహరమయిన ఉత్తమ రస భరితమయిన, రుచి కలిగించు కీర్తి కలిగిన సంస్కృత పద్యములను పుష్పములు కలది.ఈ పూల గుత్తి నాచే (తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి) రచింపబడి (కట్టబడి, వ్రాయబడి) శ్రీ పరమేశ్వరుని పాదముల జంట దగ్గర కానుకగా ఇయ్యబడినది . ఇది లోకములో బాగా ప్రకాశించుగాక !

విశేషాలు

బంగారమును కఱగినకొలది వన్నె వస్తుంది.. శాస్త్రమును తఱచినకొలది మెఱుగు వస్తుంది. తన సుప్రభాత ములోని అక్షరములు కూడా సహృదయుల మనస్సులలో కరగిన కొలది, తఱచినకొలది మెఱుగు వస్తుందని సువర్ణ పద ప్రయోగముతో కవి సూచించారు.పరబ్రహ్మమే సత్/ సత్తు/ సత్యం. పరబ్రహ్మాన్ని పలువురు పలువిధాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. ‘ఏకం సత్ విప్రా బహుధావదంతి.’’ అంటే- సత్యం ఒక్కటే, విద్వాంసులు అనేక విధాలుగా వర్ణిస్తుంటారు. ఈ శివ పరబ్రహ్మాన్ని సత్ పదముతో రస పదాన్ని జోడించి (రసోవైసః) ఈశ్లొకములో కవి సూచించారు.

Comments

Popular Posts