శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
ఉమామహేశ్వర స్తుతిః (17-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
06
నిగమాంత మహీధర గహ్వరగం
మమతాకరిణీ మదగర్వహరం !
ఉమయాయుతముజ్వల దంతనఖం
కలయేస్మిమహేశహరిం జటిలం !!
తాత్పర్యము
ఉపనిషత్తులు మొదలయిన పర్వతపు గుహలందు సంచరించునది,
ప్రేమ , అభిమానములతో కూడిన ఏనుగుల మద గర్వములను హరించునది,(శివుడు ఇంద్రియ తాపము హరించువాడని భావం)పసుపు రంగుకలది (పార్వతీదేవితో కూడినవాడు) ప్రకాశించు పలువరుసలు, నఖములు కల శివుడను జడలు గల సింహమును ధ్యానించుచుందును.
విశేషాలు
గంగణపతి బీజం. సమస్త విఘ్నాలను అణచే శక్తి కలిగిన బీజమని ప్రశస్తి. గం అంటే గణపతి అని కూడా అర్థం.ఈ బీజాక్షరాన్ని తెలకపల్లివారు ఈశ్లోకములో ప్రయోగించి మనలను ధన్యులు చేసారు.
జడలు(జూలు) కలది కనుక సింహానికి జటిలమని పేరు. జడలు గల సన్యాసిని జటిలుడు అంటారు. శివుడిని సింహంతో పోలుస్తున్నారు కనుక రెండు అర్థాలు వచ్చేటట్లుగా కవి "జటిల" పద ప్రయోగము చేసారు.

Comments

Popular Posts