శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
ఉమామహేశ్వర స్తుతిః (18-05-17)
 అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
                       
శరత్కాల మేఘాభ!గౌరీ తనుశ్రీ
తటిద్భూష నాగేంద్ర ఫూత్కారగర్జ !
సతామద్భుతానందదాస్మానవత్వం
భవాలం జయీశ్రీకరోమామహేశ! 7

తాత్పర్యము

ఆశ్వయుజ కార్తీకమాసములలో వచ్చేశరదృతువులోని , (వెన్నెల కాలము.) మేఘములా తెల్లగా ఉండేవాడా! పార్వతీదేవి యొక్క శరీరానికి శోభను ఇచ్చువాడా!మెరుపులు భూషణములుగా కలిగినవాడా ! పాములకు నాయకుడయిన వాసుకి  బుసల గర్జనలు కలవాడా ! మంచివారికి అద్భుతమయిన ఆనందము ఇచ్చువాడా ! ఈశ్వరా !అన్నింటిని కాపాడు సమర్థుడవు!; విజయుడవు. అన్నింటినీ గెలువగలవాడవు; సంపదలనిచ్చువాడా! ఓ పార్వతీపరమేశ్వరా ! మమ్ములను నువ్వే రక్షించాలి.

 విశేషాలు

గౌరవర్ణము కలది గౌరి. గౌరము అంటే 1. ఎఱ్ఱనిది;2. తెల్లనిది;3. పసుపుపచ్చనిది;4. స్వచ్ఛమయినది.అని అర్థాలున్నాయి.  నాలుగవ పాదములోని “భవాలం” ప్రౌఢ ప్రయోగము. దీనిని భవ,అలం అని విడదీసుకోవాలి. “అలం”  పదమునకు సమర్థుడు అని అర్థము.(నాకు ఈశ్లోక విషయములో సందేహము తీర్చిన పెద్దలు శ్రీ అయాచితం నటేశ్వర శర్మగారికి ధన్యవాదములు)

Comments

Popular Posts