శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
మఙ్గళా శాసనం (వైష్ణవపరిభాషలో ఆశీర్వాదము). (26-05-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి
6
శ్రీమత్స్వర్ణ ముఖీప్లక్ష ఛ్చాయాయాం ఖూర్దతేంబయా !
జ్ఞాన ప్రసూనయాసాకం శ్రీ మహేశాయ మఙ్గళం !!
తాత్పర్యము
ఒప్పిదముగల శ్రీకాళహస్తిలోని స్వర్ణ ముఖీనది ఒడ్డున రావి చెట్టు నీడలో మాతృకయగు జ్ఞానప్రసూనాంబికతో కలిసి, క్రీడించుచున్న మహేశునికి శుభము పాడుచున్నాను.
విశేషాలు
1. శివుని ఆనతిపై ఆకాశ గంగ స్వర్ణ కాంతులతో ప్రవహిస్తున్నది కనుక స్వర్ణ ముఖి అని పేరు వచ్చిందని ఒక కథ. శ్రీ కాళహస్తి ఆలయాన్ని కట్టేటప్పుడు కూలీలు రోజూ సాయంత్రం ఈ నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటేచాలు. బంగారంగా మారేదట. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చిందని ఇంకొక కథ.
2. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. ధూర్జటి ఈ పేరునే వాడాడు.
3. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు.
4. ఆమె దయవలన భక్తునకు తమోగుణ రజోగుణములను అనగా ఇంద్రియములు మనస్సును జయించిన శుద్ధ సత్వగుణము ఏర్పడుతుంది.. సత్వగుణముచేత జ్ఞానము కలుగుతుంది. అందుకే శ్రీదేవిని జ్ఞాన ప్రసూనాంబ అని పిలుస్తారు. అంబాత్రయంలో ఒకరు జ్ఞాన ప్రసూనాంబ. (1. జ్ఞానాంబ -శ్రీకాళహస్తి, 2.భ్రమరాంబ -శ్రీశైలం, 3.మూకాంబ - మంగళూరు).
(ఈ శ్లోక క్రియా పద వివరణచేసిన ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ అయాచితం నటేశ్వరశర్మగారికి ధన్య వాదములు)

Comments

Popular Posts