శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమామహేశ్వర స్మృతిః (శ్రీ ఉమామహేశ్వరుల తలపు). (03-06-17)
అనువాదకుడు : డా.తాడేపల్లి పతంజలి

చితా భస్మ లేపస్ఫురచ్చారుకాయం
దధానం వరం వ్యాఘ్ర చర్మోత్తరీయం!
లలాటాగ్ని విధ్వస్త కందర్ప దర్పం
మనశ్చిత్స్వరూపం స్మరోమా మహేశం!  04


తాత్పర్యము

చితాభస్మపు పూతతో ప్రకాశించు అందమయిన శరీరము కలవానిని,శ్రేష్ఠమయిన పులిచర్మమును పైబట్టగా ధరించువానిని,నుదుటనుండి పుట్టిన అగ్నితో పూర్తిగా నశించిన మన్మథ గర్వము కలవానిని( మన్మథుని కాల్చిన శివుని అని భావం)జ్ఞాన స్వరూపుని మహేశుని స్మరింపుము.

విశేషాలు

చితాభస్మము

ధరించేది చర్మం,ఆభరణాలు సర్పాలు,అంగరాగము చితాభస్మము,ఉన్నది ఒక్క ఎద్దు,అది దున్నుటకు ఉపయోగపడదు.ఈయన ఐశ్వర్యమిది .అని ఆలోచించి గంగాదేవిశంకరుని విడచి రత్నాకరుని(సముద్రుని) చేరింది-ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము.చివరికి భార్యకూడా విడిచి పెడుతుందికదా!” అని శివుని గురించి ఒక చమత్కార భావముంది. (“వాసశ్చర్మ .... అనే చాటు శ్లోకంలో).
ఇప్పటికి ప్రతిరోజూ ఉజ్జయిని లోని మహా కాలేశ్వర జ్యోతిర్లింగానికి రోజూ తెల్లవారు ఝామున శ్మశానం నుంచి తెచ్చిన చితా భస్మము తో  అభిషేకం చే స్తారు. ఆ తరువాత ‘’భస్మ హారతి’’ జరుగుతుంది.
ఈ లోక నివాసము అస్థిరమని, ఎప్పటికయినా మానవుడనేవాడు చితాభస్మము కాక తప్పదని, తనను సేవించమని శివుని చితా భస్మ ధారణలోని విశేషం.

Comments

Popular Posts